కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘వృషకర్మ’ ఫస్ట్ టీజర్ వచ్చేసింది. మొదట ఇదొక అడవులలో గుప్త నిధి కోసం జరిగే సాహసయాత్ర అని టాక్ వచ్చినప్పటికీ, ‘అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుందని’ ఫస్ట్ గ్లిమ్స్‌లో ఈ సినిమా కథ గురించి క్లూ ఇచ్చారు. ఇప్పుడు టీజర్‌లో పునర్జన్మలో ప్రతీకార కథ అని సూచిస్తోంది. కనుక చాలా లోతైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.