రెవెన్యూ అధికారులు నేడో రేపో ఎర్రవల్లి గ్రామంలో పలువురు రైతులకు నోటీసులు జారీ చేయబోతున్నారు. వారిలో మాజీ సిఎం కేసీఆర్ పేరు కూడా ఉండవచ్చు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు ఇటీవల ఎర్రవల్లిలో భూసర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్: 325లో 388 ఎకరాలు ఉండాలి కానీ 343 ఎకరాలు మాత్రమే కనిపిస్తోంది.
కనుక 45 ఎకరాలు తక్కువున్నట్లు గుర్తించిన అధికారులు ఇదే విషయం నివేదికలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం రేవంత్ రెడ్డి కనిపించకుండా పోయిన ఆ 45 ఎకరాలు ఎక్కడున్నాయో గుర్తించి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కనుక వాటిని కనుగొనేందుకు ఎర్రవల్లి గ్రామస్థులతో పాటు మాజీ సిఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
రెవెన్యూ అధికారులు వారి భూరికార్డులు పరిశీలించిన తర్వాత ఆ 45 ఎకరాలు ఎవరి అధీనంలో ఉన్నాయో గుర్తించి స్వాధీనం చేసుకుంటారు. ఆ భూమిని స్థానిక రైతులకు, అమర వీరుల కుటుంబాలకు పంచి పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఒకవేళ ఈ 45 ఎకరాలు కేసీఆర్ ఫామ్‌హౌసులో ఉంటే?ఆ భూమి స్వాధీనం మాట దేవుడెరుగు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య మరో కొత్త యుద్ధం మొదలవుతుంది.