అమెజాన్ ప్రైమ్ వీడియోలో “ది ట్రైటర్స్’ అనే సరికొత్త రియాలిటీ గేమ్ షో ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతోంది. టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా ఈ షోకు హోస్ట్‌గా టీవీ షోలో అరంగేట్రం చేస్తున్నారు.
అందరినీ ఆకట్టుకుంటున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ గేమ్ షోకి పూర్తిభిన్నంగా దీనిలో పాల్గొనేవారు మైండ్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒక కోటలో ఇరవై మంది సెలబ్రిటీలు ఈ పోటీలో పాల్గొంటారు. వారిలో నుంచి హోస్ట్ కొందరిని మోసగాళ్ళుగా ఎంపిక చేస్తారు.
వారు అమాయకులుగా ఉండే మిగిలినవారితో కలిసిపోయి, వారిని షో నుంచి ఎలిమినేట్ చేసి బయటకు పంపేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. కనుక ఈ షోలో పాల్గొనే వారిలో ఎవరు నమ్మకస్తులో, ఎవరుమోసగాళ్లో గుర్తిస్తూ వారి మోసాల నుంచి తప్పించుకుంటూ కంటెస్టెంట్స్ ముందుకు సాగాల్సి ఉంటుంది.
నమ్మకం, ద్రోహం, మోసం అనే థీమ్‌తో సాగే ఇటువంటి సైకలాజికల్ గేమ్ ఇంతవరకు తెలుగులో రాలేదు. వీరిలో కొందరిని హోస్ట్ రహస్యంగా ట్రైటర్స్ అంటే ద్రోహులుగా ఎంపిక చేస్తారు, మిగిలిన వారు ఇన్నోసెంట్స్ అంటే అమాయకులుగా ఉంటారు.
ద్రోహులు ఎవరో అమాయకులకు తెలియదు. ప్రతి రాత్రి ద్రోహులంతా కలిసి ఒక అమాయక పోటీదారుడిని గేమ్ నుండి ఎలిమినేట్ చేస్తారు. మరోవైపు అమాయకులు అందరూ కలిసి చర్చల ద్వారా తమలో దాగున్న ద్రోహిని గుర్తించి సర్కిల్ ఆఫ్ షాక్ ఓటింగ్ ద్వారా బయటకు పంపేయాల్సి ఉంటుంది. చివరి వరకు నిలిచి గెలిచిన విజేతకు ఒక కోటి రూపాయల భారీ ప్రైజ్ మనీ దక్కుతుంది.
మొత్తం పది ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ షోలో ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు, కొత్త ఎపిసోడ్ మొదలవుతుంది. దీనిలో సినీ, టెలివిజన్, సోషల్ మీడియా రంగాలకు చెందిన ఇరవై మంది ప్రముఖులు పాల్గొంటున్నారు.
వారిలో గాయని చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి మహవాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుల్లేఖ రామన్, మరియు విష్ణు ఓయ్ తదితరులు ఉన్నారు.