రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ ప్రేమ కథలో కొత్త ట్విస్ట్. తమ ప్రేమ పెళ్ళి ఇష్టం లేని తన తండ్రి ఈ సమస్యకు కారణమని సంతోష్ గౌడ్, అతను ప్రేమించిన యువతి తల్లి రూపారెడ్డి ఆరోపిస్తున్నారు.
నార్సింగి పోలీసులు రూపారెడ్డిని అరెస్ట్ చేయడంతో వారి ఆరోపణలు నిజమేననుకుంటున్న సమయంలో, రూపారెడ్డి బాధితులు చాలా మంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగడంతో కథ మలుపు తిరిగింది.
బాధిత మహిళలలో ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ, “రూపారెడ్డి మణికొండతో సహా చుట్టుపక్కల చాలా ప్రాంతాలలో మావంటి వారిని మోసం చేసి డబ్బు కాజేశారు. మావంటివారితో ఆమె ముందు పరిచయం పెంచుకుంటుంది. నాకు 2021 నుంచి ఆమెతో పరిచయం ఉంది. అప్పుడప్పుడు ఆమె కొంత డబ్బు అడిగి తీసుకుంటూ వెంటనే తిరిగి ఇచ్చేస్తూ నా వంటివారి నమ్మకం సంపాదించుకుంటారు.
అవతలి వ్యక్తిని మాటలతో బురిడీ కొట్టించి డబ్బు లాగేయడంలో ఆమెకు మంచి నేర్పుంది. గత ఏడాది నేను హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుకుందామని డబ్బు సిద్ధం చేసుకొని ఆమెకు చెప్పాను.
ఆ తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చి తాను అత్యవసరంగా పెద్ద పేమెంట్ ఒకటి చేయాల్సి ఉందని లేకుంటే పరువు పోతుందంటూ చాలా డ్రామా చేసింది. పది రోజులలో మూడు లక్షల వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తానని చెప్పి నా వద్ద నుంచి రూ.21 లక్షలు తీసుకువెళ్ళింది.
ఆ మూడు లక్షల వడ్డీతో ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవచ్చు కదా అని ఆమె చెప్పింది. నిజమే అనిపించి ఇచ్చాను. అంతే! మర్నాటి నుంచి ఫోన్ స్విచ్చాఫ్.. మనిషి దొరకదు. అప్పుడే తెలిసింది ఆమె నాలాగ చాలా మందిని మోసం చేసిందని.
ఆమె ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కులు మా అందరి దగ్గర ఉన్నాయి. కానీ వాటితో కోర్టుకి వెళ్తే అసలు కూడా దక్కదని ఆమె బెదిరించేవారు. కానీ ఇంతకాలం అందరం భరించినా మా సొమ్ము తిరిగి ఇవ్వలేదు. కనుక నేడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చాము,
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కొడుకు ప్రేమ వ్యవహారానికి, మా సమస్యకు ఎటువంటి సంబందమూ లేదు. కానీ ఆమె తెలివిగా ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను తెచ్చి రాజకీయం చేసి తప్పించునేందుకు ప్రయత్నిస్తోంది,” అని అన్నారు. పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తున్న బాధితులు రూపారెడ్డి తమని ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తూ, ఆమె ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెల్లని చెక్కులు చూపిస్తున్నారు.
కనుక సంతోష్ గౌడ్ ప్రేమ కథ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కుటుంబ వ్యవహారానికి రూపారెడ్డి అరెస్టుకి ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టమయ్యింది. సంతోష్ గౌడ్ ప్రేమకథలో ఇది ఊహించని ట్విస్ట్ కదా?