హైదరాబాద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు కుమారుడు సంతోష్ గౌడ్ ప్రేమ వివాహ వ్యవహారంపై వారి కుటుంబంలో జరుగుతున్న గొడవలు మీడియా ఇంటర్వ్యూలు, దాడులు, పోలీస్ కేసుల వరకు వెళ్ళింది.
సంతోష్ గౌడ్ ఏమన్నారంటే, నేను రూపారెడ్డిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి మా ఇద్దరిపై ఒత్తిడి పెరిగింది. మణికొండలోని రూపారెడ్డి ఇంట్లోకి కొందరు దుండగులు ప్రవేశించి ఆమెను బెదిరించారు.
దీని వెనుక నా తండ్రి ప్రకాష్ గౌడ్ హస్తం ఉంది. మా ఇద్దరిని చంపేసినా ఆశ్చర్యం లేదు. నా తండ్రి వలన మా ప్రాణాలకు ప్రమాదం ఉందని చెపుతున్నా పోలీసులు మాకు రక్షణ కల్పించడం లేదు. రూపారెడ్డి డయల్-100కు సమాచారం ఇచ్చినా పోలీసులు సరైన విధంగా స్పందించలేదు.
నా తండ్రి ఎమ్మెల్యే కనుక పోలీసులు ఆయన ఒత్తిళ్ళకు తలొగ్గి మాపైనే ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు,”అని సంతోష్ గౌడ్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై రూపారెడ్డి కూడా స్పందిస్తూ, “మాపై తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపించాలని కుట్ర జరుగుతోంది. కానీ మాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. మేము చట్టబద్ధంగా పోరాడతాము. పోలీసులు మాకు రక్షణ కల్పించాలి,” అని అన్నారు.
మరోవైపు, కుమారుడు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తోసిపుచ్చారు. ఇక తన కుమారుడితో తమకు ఎటువంటి సంబంధమూ లేదు. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు.
ఇది వారి కుటుంబ సమస్య అయినప్పటికీ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక అటు రాజకీయ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం, కేసులపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.