అలనాటి మేటి నటుడు రంగనాథ్ అనేక సినిమాలలో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఆయన జీవిత చరమాంకంలో కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవితం గడిపారు. చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
ఆయన ఇంట్లో ఆరేళ్ళు పనిమనిషిగా చేసిన మీనాక్షికి తాను పొదుపు చేసుకున్న సొమ్ము ఇవ్వాలని గోడపై వ్రాసి చనిపోయారు. ఆమె తనకు చేసిన సేవలకు కృతజ్ఞతగా తన పొదుపు సొమ్ము ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కనుక ఆమెను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని గోడపై వ్రాశారు. ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన చివరి కోరిక ప్రకారం ఆయన బ్యాంక్/పోస్టాఫీసులో పొదుపు చేసుకున్న సొమ్ము తమ చేతికి రాగానే, తప్పకుండా మీనాక్షికి అందజేస్తామని, తండ్రి చివరి కోరికని గౌరవించడం తమ ధర్మమని రంగనాథ్ కొడుకు, కూతురు చెప్పారు. ఆస్తుల కోసం తల్లితండ్రులను చంపేసుకుంటున్న ఈ రోజుల్లో చనిపోయిన తండ్రి చివరి కోరికని గౌరవించే ఇలాంటి వారు ఎందరున్నారు?