ఇక తెలంగాణలో గ్రామ స్థాయి వరకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇంటర్నెట్ సేవల కోసం ‘టీ-ఫైబర్’ మాత్రమే వినియోగించబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అన్ని శాఖలకు, జిల్లా కలెక్టర్లకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచే టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ని వినియోగించుకుంటూ పనులు చేసుకునేందుకు వీలుగా ఈ నెలాఖరులోగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జీవోలో పేర్కొన్నారు.
ఈ మార్పు, ఏర్పాట్ల కోసం ప్రతీ విభాగం ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీ-ఫైబర్‌కి పూర్తిస్థాయిలో మారినట్లు ధృవీకరిస్తూ శాఖాధిపతులకు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ నెట్‌వర్క్ వాడుకుని పనిచేస్తే, వాటికి బిల్లులు చెల్లించబడవని పేర్కొన్నారు. అలాంటి బిల్లులను తిరస్కరించాలని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.
కానీ ఇంత తక్కువ సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్‌కి మారడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యపడినా, ఒకేసారి ఇంత లోడ్ పెరిగితే టీ-ఫైబర్ తట్టుకొని నిరంతరాయంగా ఇంటర్నెట్ సౌకర్యం అందించగలదా? అనే ప్రశ్నలకు సెప్టెంబర్‌లో సమాధానాలు లభిస్తాయి.