తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కావేరి జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, సభలో కొందరు ‘త్రిష... త్రిష...’ అంటూ నినాదాలు చేశారు.
దాంతో ఆయన త్రిషని ఉద్దేశ్యించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం చెన్నైలోని నీలంకరైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం తరలించారు.
ఆయనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినప్పుడు, డీఎంకే కార్యకర్తలు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నీలంకరైలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉదయనిధి స్పందిస్తూ తనపై నమోదైన ఈ కేసు, అరెస్ట్, విచారణ అన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్నారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది కనుక దీనిపై న్యాయపరంగా పోరాడుతానన్నారు. డీఎంకే పార్టీ ఈ అరెస్తుని తీవ్రంగా ఖండించింది.