ఎయిర్ ఇండియా విమానానికి నేడు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకున్నప్పుడు గాల్లో ఉండగా ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనయ్యింది.
బలమైన ఈదురు గాలుల ప్రభావంతో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు దిగిపోయింది. దాంతో విమానంలోని ప్రయాణికులు కొందరు స్వల్పంగా గాయపడ్డారు. కానీ ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్లు చాలా చాకచక్యంగా విమానాన్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికి పైలట్లు విమానాన్ని సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు.
విమానాలు గాల్లో ఉన్నప్పుడు ఎయిర్ టర్బులెన్స్ వలన కుదుపులు రావడం సర్వసాధారణమే. కానీ వాటి కారణంగా విమానం ఒకేసారి300 అడుగుల మేర కిందకు జారిపోవడమే ఆందోళన కలిగించే విషయం. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న వైద్య, సహాయ సిబ్బంది గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనలో నలుగురు సిబ్బంది, పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. కానీ ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై డిజిసిఏ విచారణకు ఆదేశించింది.