మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావుకి దైవభక్తి ఎక్కువే. కనుక సమయం చిక్కినప్పుడు తిరుమల తదితర ఆలయాలకు వెళ్ళి వస్తుంటారు. కనుక తరచూ అలా ఎందుకు వెళ్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే చాలా హాస్యాస్పదంగా ఉంతుంది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హరీష్ రావు ఈ ఏడాది జూన్ 2న తమిళనాడులోని తిరుచ్చి వెళ్ళి వచ్చారు. మళ్ళీ జూలై 23న శివమొగ్గ ఆలయానికి వెళ్ళి వచ్చారు.
ఆయన తరచూ తమిళనాడులో ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారో మాకు తెలుసు. క్షుద్ర పూజలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటే. అందుకే అక్కడికి వెళ్ళి వస్తున్నారా? మరేదైనా కారణముందా? హరీష్ రావు చెప్పాలి.
అనేకమంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని వారు పదేళ్ళపాటు దోచుకున్నారే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఎన్ని పూజలు చేసినా వారిని తెలంగాణ ప్రజలు నమ్మరు,” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.