తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశమయ్యి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల గురించి చర్చించనున్నారు.
హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) భూసేకరణ, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన కేంద్ర నిధులు, అనుమతులపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల పురోగతికి కేంద్ర సహకారం కోరుతూ సంబంధిత శాఖల మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పెండింగ్ హామీల అమలు, కేంద్ర గ్రాంట్లు, పన్నుల వాటా విడుదల అంశాలను కూడా సీఎం ప్రస్తావించనున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, వ్యవసాయానికి సంబంధించిన మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై కూడా కేంద్రంతో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.