ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉదయం సికింద్రాబాద్, ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.
భక్తులు తరపున ఆలయ నిర్వాహకులు ప్రశ్నిస్తూ “ఈసారి బోనాల ఉత్సవాలతో సంతృప్తి చెందావా తల్లీ?” అని అడిగారు. ఆమె ఏమన్నారంటే, “నేను సంతోషంగా లేను. చాలా కోపంగా ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి? ఏటా మీరు నాకు పూజలు చేస్తున్నారని సరిపెట్టుకుంటూ నా బిడ్డలని కాపాడుకుంటున్నా.
నా భక్తులు నాకు భక్తితో కానుకలు ఇస్తుంటే దానిలో గోరంత నాకు ఇవ్వడం లేదు. మీ అహంకారాన్ని చూస్తూనే ఉన్నా. నా విగ్రహ ప్రతిష్ట చేస్తామని చెప్పి మాట తప్పారు. ఆరు నెలల్లోగా నా విగ్రహ ప్రతిష్ట జరుగకపోతే సహించను. ఎవరు అడ్డుపడినా ఊరుకోను. ఈసారి నా ఉగ్ర రూపం చూస్తారు. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది,” అని అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత హెచ్చరించారు.
ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు “ఈ ఏడాది వర్షాలు కురుస్తాయా తల్లీ?” అని ప్రశ్నించగా “కురుస్తాయి.. చాలా భారీగా కురుస్తాయి. వాటిలో జనం కొట్టుకుపోతారు. అగ్నిప్రమాదాలు కూడా తప్పవు. పిల్లలు తల్లితండ్రులను రోడ్లపై వదిలేస్తున్నారు.. వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. వీటన్నిటికీ పరిహారం చెల్లించక తప్పదు... జాగ్రత్త!” అని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు.