హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో అదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలైంది. దీంతో ఆయా ప్రాంతాలలో రోడ్లపై నీళ్ళు నిలిచి ట్రాఫిక్ జామ్ అవుతోంది.
నగరంలో ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడీగూడ పంజాగుట్ట, అమీర్ పేట, బోరబండ, యూసఫ్‌గూడా, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో వీధులలో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి.
హైడ్రా, జిహెచ్‌ఎంసి, ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలో దిగి రోడ్లపై నిలిచిన నీటిని ఖాళీ చేసేందుకు కృషి చేస్తున్నాయి.
సాధారణ పని దినాలలో ఎలాగూ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఐటి కంపెనీ ఉద్యోగులకు రెండు రోజులు వారాంతపు సెలవులు ఉన్నందున పలువురు వాహనాలు వేసుకొని సినిమాలకు, షాపింగులకు బయలుదేరుతుంటారు. కనుక శనిఆదివారాలలో కూడా నగరంలో రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతూనే ఉంటాయి.