తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నేడు లష్కర్ బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే వేలాదిగా మహిళలు కుటుంబ సమేతంగా బోనాలతో ఆలయం వద్ద క్యూ కట్టారు. ఆలయం పరిసర ప్రాంతాలన్నీ బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
అమ్మవారి బోనాల జాతర ఉత్సవం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలు పూలతో అందంగా అలంకరించారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేకంగా రేను క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
నేడు పలువురు ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు కనుక వారి కోసం రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు.
సాధారణ భక్తుల కోసం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేసి అందరూ వీలైనంత త్వరగా అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి బోనాల జాతరకు వేలాదిగా భక్తులు హాజరవుతున్నారు కనుక ఆలయ పరిసరాలలో సుమారు 1,200 మంది పోలీసులను మొహరించారు. ఆలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాల చుట్టూ పక్కల అనేక ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
రేపు (సోమవారం) అమ్మవారి ఆలయ ఆవరణలో రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కనుక ఈ రెండు రోజులు ఆలయం చుట్టూ రెండు కిమీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు.
ఆగస్టు 9 (ఆదివారం) పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయి. ఆగస్టు 10 (సోమవారం): అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఈ ఆషాడ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.