పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల విధానం అమలులోకి వచ్చింది. అదిప్పుడు ఏ స్థాయికి చేరుకుందంటే రూ.5, 10 నగదు చెల్లింపులు కూడా దాని ద్వారానే జరుగుతున్నాయి.
దీనికి అత్యంత ప్రజాదరణ లభించడంతో అంతకంతకూ యూపీఐ పేమెంట్ పెరుగుతూనే ఉన్నాయి. అలాగే వీటి నిర్వహణ ఖర్చుల భారం కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది.
ఇంతకాలం ఈ భారాన్ని ఆయా బ్యాంకులు, సర్వీస్ అందిస్తున్న పేమెంట్ కంపెనీలే భరిస్తున్నాయి. కానీ అవి కూడా ఈ అదనపు భారం భరించలేకపోతున్నాయి.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కొంత రుసుము వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ. 2,000 పైబడిన చెల్లింపులపై 0.3 నుంచి 0.5 శాతం వరకు ఛార్జీలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ భారం ప్రజలపై కాకుండా పెద్ద వ్యాపారులపైనే విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడే దీని గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుంది. కానీ యూపీఐ వ్యవస్థ బలంగా, స్థిరంగా సాగాలంటే ఎవరో ఒకరు ఈ భారం భరించక తప్పదని భావిస్తున్నాను. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు ఎటువంటి ఊహాగానాలు మంచిది కాదు,” అని అన్నారు.