విసి సజ్జనార్‌ పోస్ట్ చేసిన ఈ వీడియో చూశారా?

August 06, 2026
img

హైదరాబాద్‌ కమీషనర్‌ విసి సజ్జనార్‌ ఒక పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యత గల ఓ పౌరుడుగా ఎప్పటికప్పుడు ప్రజలను మాదకద్రవ్యాలు, వ్యసనాలు, రీల్స్ పిచ్చి వంటి వివిధ అంశాలపై చైతన్య పరుస్తుంటారు. కుటుంబ సంబంధాలు ఏవిధంగా బలహీనపడుతున్నాయో తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

అది చూసినప్పుడు అవును నిజమే కదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో మనమూ ఉన్నామా? అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. ఆయనేమన్నారో అయన మాటల్లోనే...     

“బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?! రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి?

 నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. 

ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే. 

కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. 

మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి? 

చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? 

తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి,” అని హితవు పలికారు.

Related Post