ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉందా?

August 05, 2026
img

తెలంగాణ ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రజారంజకంగా తమ పాలన సాగుతోందని గొప్పగా చెప్పుకుంటుంది. వేల కోట్లు వ్యయం అయ్యే మూసీ, ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ పనులు వంటి అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతుంటుంది. మరోపక్క రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. కనుక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందనిపిస్తుంది. 

కానీ తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు 2013,2017,2021 సం.ల పీఆర్సీకి సంబందించిన పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్‌లోని బస్ భవన్ ఎదుట మంగళవారం ఆందోళన చేయాల్సి రావడం చాలా బాధాకరం. 

ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేము న్యాయంగా మాకు రావాల్సినవాటి గురించే అడుగుతున్నాము. తార్నాక ఆస్పత్రిలో సభ్యత్వం రెన్యువల్ చేసి రెండు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాలని కోరుతున్నాము. 

మా సమస్యలు గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. కనుక ధర్నా ఆందోళన చేయక తప్పలేదు. ఇప్పటికీ స్పందించకపోతే మా ఆందోళనలు ఉదృతం చేస్తాము, ” అని హెచ్చరించారు. 

ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఈ వయసులో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని బస్ భవన్‌కు రావడం, వచ్చి ధర్నా చేయడం వారికి చాలా కష్టమే. ఇది ప్రభుత్వానికి కూడా అప్రతిష్టే కదా?


Related Post