తెలంగాణ పోలీస్ యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచారు. దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తం 16 రాష్ట్రాలలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దీనిలో వివిధ బ్యాంకుల మేనేజర్లతో సహా మొత్తం 104 మంది సైబర్ నేరగాళ్ళని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పది రోజుల పాటు 16 రాష్ట్రాలలో సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 32 బృందాలు పాల్గొన్నాయి. నిందితులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 1,055 కేసులు నమోదయ్యాయి. కానీ ఎవరూ వారిని పట్టుకోలేకపోయారు. సైబర్ నేరగాళ్ళు గత ఏడాది కాలంలోనే ప్రజలను మోసం చేసి సుమారు రూ.127 కోట్లు దోచుకున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి రూ.36 లక్షల నగదు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన 152 పాస్ పుస్తకాలు, 234 డెబిట్ కార్డులు, ఇంకా 26 ల్యాప్ టాపులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువస్తున్నారు.
తర్వాత పోలీస్ కస్టడీలో వారిని ప్రశ్నిస్తే మరింత మంది నేరగాళ్ళు, వారి వివరాలు లభించే అవకాశం ఉంది.
సైబర్ నేరగాళ్ళని పట్టుకునేందుకు దేశంలో ఈ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించడం, తొలి ప్రయత్నంలో ఇంతమందిని అరెస్ట్ చేయడం చాలా గొప్ప విషయమే. తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలు తెలంగాణ పోలీసుల సామర్ధ్యాన్ని గుర్తించేలా చేశారు. అందుకు వారికి అభినందనలు.