జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో పరిషత్ బరిలోకి...

February 24, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు జోగులాంబ అమ్మవారంటే నాకు చాలా సెంటిమెంట్ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్తానం ప్రారంభిస్తాను. రాబోయే పరిషత్ ఎన్నికలలో మన పార్టీ పోటీ చేస్తుంది. మా పార్టీలో రైతులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాడినవారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యం, గౌరవం కల్పిస్తాము,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుని ఎండగడుతూ, “ఎన్నికలప్పుడు పంట రుణమాఫీ చేస్తామని, మహిళలకు నెలకు రూ.2,500 పించన్ ఇస్తామని, మహాలక్ష్మి పధకం కింద తులం బంగారం ఇస్తామంటూ అనేక వాగ్దానాలు చేశారు. కానీ రెండున్నరేళ్ళ పాలన పూర్తవుతున్నా నేటికీ అమలు చేయడం లేదు. ఎన్నికలొస్తేనే కాంగ్రెస్‌ నాయకులకు రైతులు గుర్తొస్తారు. త్వరలో ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికలొస్తున్నాయి. కనుక డబ్బు సంచులతో మీ ముందుకు వస్తారు. వాళ్ళు డబ్బు ఇస్తే కాదనకుండా తీసుకోండి. అది మీ అందరి కడుపులు కొట్టి సంపాదించిన డబ్బే. కానీ ఓట్లు మాత్రం మీకోసం కొట్లాడుతున్న రంజిత్‌కే వేయండి,” అని అన్నారు. 

అనంతరం కల్వకుంట్ల కవిత జాగృతి సభ్యులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్లి కలెక్టర్ సంతోష్‌కు రైతు సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. 


Related Post