తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం వికారాబాద్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం నిర్వహించారు. సిఎం రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాడు మహాత్మాగాంధీ ఉన్నప్పుడే పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. నేటికీ ఉన్నాయి. అవి పార్టీలో ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా చూడాలి తప్ప మనల్ని ఎవరో వ్యతిరేకిస్తున్నారని వారిని తొక్కేయాలనుకూడదు. ఇలా ఒకరినొకరు తోక్కేసుకుంటూ ఉంటే మనల్ని ప్రత్యర్ధులు తొక్కుకుంటూ ముందుకు సాగిపోతారు.
జిల్లా అధ్యక్ష పదవి అంటే జిల్లాకు నేనే అధిపతినని అనుకోరాదు. అధ్యక్ష పదవి అనేది కుటుంబ పెద్ద వంటి బాధ్యత అని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
మీ కంటే వయసు, అనుభవం తక్కువే ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అప్పుడు నేను ప్రతీ సీనియర్ నాయకుడు ఇంటికీ స్వయంగా వెళ్లి మనలో మనం కుమ్ములాడుకుంటే మనల్నే నమ్ముకున్న లక్షలాది కార్యకర్తలు నష్టపోతారని, కలిసికట్టుగా పోరాడితే అధికారంలో రావచ్చని నచ్చజెప్పాను. వారు కూడా నాతో ఏకీభవించారు. అందరం కలిసికట్టుగా పనిచేశాము. ఎన్నికలలో విజయం సాధించాము.
2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కంటే మనకి ఓటింగ్ కేవలం 2 శాతం ఆధికంగా ఉండేది. కానీ 4 నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అది ఒకేసారి 4 నుంచి 12 శాతానికి పెరిగింది. కనుక కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.