తెలంగాణ ప్రభుత్వం నేడు ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించింది. ఆ జాబితాలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ కూడా ఒకరు. ఆయనని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు బదిలీ చేసి ఆయన స్థానంలో స్నేహ శబరీష్‌ను జిల్లా కలెక్టరుగా నియమించింది.
ఈ బదిలీపై ఇటు అద్వైత కుమార్ సింగ్, అటు జిల్లా ప్రజలు కూడా చాలా సంతోషపడటం విశేషం. అద్వైత కుమార్ సింగ్ ఉత్తరాదికి చెందినవారు కనుక ఈ మారుమూల జిల్లా నుంచి విముక్తి లభించి ఢిల్లీకి బదిలీ అయినందుకు సంతోషించడం సహజం.
కానీ ఆయన వెళ్ళిపోతుంటే ప్రజలు కూడా ఎందుకు సంతోషిస్తున్నారు? అంటే జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, “అద్వైత కుమార్ సింగ్ రెండేళ్ళు జిల్లా కలెక్టరుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సంక్షేమానికి చిన్న సాయం కూడా చేయలేదు.
జిల్లాలో మారుమూల తండాలు, గ్రామాలు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటినీ ఆయన ఖర్చు చేయకుండా వెనక్కు తిప్పి పంపేశారు. ఇలాంటి కలెక్టర్ బదిలీపై వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేడు అంబేద్కర్ సెంటర్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుతున్నాము,” అని చెప్పారు.