ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల ఆరాధ్య దైవం, గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని ముద్దుగా పిలుచుకునే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం మెస్సీ కోల్‌కతా చేరుకున్నారు.
ఫుట్‌బాల్ అంటే ప్రాణంపెట్టే బెంగాలీలు ఆయన కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన గౌరవార్థం కోల్‌కతాలోని లేక్ టౌన్ వద్ద 70 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌తో కలిసి మెస్సీ తన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు.
ఆ తర్వాత అక్కడి నుంచి సమీపంలో ఉన్న సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నారు. అప్పటికే స్టేడియం హౌస్‌ఫుల్ అయిపోయి అభిమానులతో కిటకిటలాడుతోంది. మెస్సీ రాగానే అభిమానులు హర్షధ్వానాలతో ఆయనకు స్వాగతం పలికారు. కానీ ఆయనను స్థానిక రాజకీయ నాయకులు, ఫుట్‌బాల్ కోచ్‌లు, మాజీ, తాజా ఫుట్‌బాల్ క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు చుట్టుముట్టారు. దాంతో మెస్సీ వారి నుంచి తప్పించుకొని ముందుకు సాగలేకపోయారు. ఆయన్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చిన అభిమానులు బ్యారికేడ్లు, గేట్లు దాటి ఆయన వద్దకు చేరుకోసాగారు.
దాంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే అక్కడి నుంచి ఆయనను బయటకు తీసుకుపోయారు. మెస్సీ కేవలం పది నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ఆయన సరదాగా కాసేపు ఫుట్‌బాల్ ఆడితే చూడాలని ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
వారిలో చాలామంది ఈ ఈవెంట్ కోసం 5–10 వేల రూపాయలు పెట్టి టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ మెస్సీ కనీసం కనిపించకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
నీళ్లు బాటిళ్లు, కుర్చీలు స్టేడియంలోకి విసురుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టేడియంలోకి దూసుకువచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు వచ్చి వారిని అదుపు చేసే వరకు సుమారు గంటసేపు వారి విధ్వంసం కొనసాగుతూనే ఉందంటే వారు ఎంతగా ఆగ్రహం చెందారో అర్థం చేసుకోవచ్చు.
మెస్సీ మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి టీమ్, మెస్సీ టీమ్ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. కోల్‌కతా ఘటనల నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరి మెస్సీ హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతుందో, ఎలా ముగుస్తుందో?