పద్మశ్రీ అవార్డు గ్రహీత నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా ఎవరో ఒకరి గురించి లేదో ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల ఈటీవీ విన్ అధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అలనాటి మేటి నటుడు కాంతారావు గురించి మాట్లాడుతూ, “కాంతారావుని చూస్తే ఎంజీఆర్ ఉచ్చపోసుకునేవారు,” అని అన్నారు. ఆయన ఉద్దేశ్యం కాంతారావు కత్తి యుద్ధం గొప్పగా చేస్తారని చెప్పడమే కానీ ఆ మాట చెప్పేందుకు తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ గురించి చులకనగా మాట్లాడారు.
అందుకు తమిళ నటుడు విశాల్‌తో సహా పలువురు రాజేంద్ర ప్రసాద్ తీరుని తప్పు పడుతూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి, “తమిళుల సినీ పరిశ్రమ దేవుడు ఎంజీఆర్. నేను కాంతారావుగారిని పొగుడుతూ పొరపాటున ఎంజీఆర్‌ని ఉద్దేశ్యించి తప్పుగా మాట్లాడాను. ఇందుకు నన్ను క్షమించమని అందరినీ వేడుకుంటున్నాను,” అని అన్నారు.