రామాయణ టీజర్‌: భక్తి కంటే టెక్నాలజీకే పెద్ద పీట!

April 02, 2026
img

భారతీయ సినీ పరిశ్రమలో రామాయణ, మహాభారత గాధలను ఇప్పటివరకు ఎంతమంది ఎన్నిసార్లు సినిమాలుగా, టీవీ సీరియల్స్‌గా తీశారో లెక్కేలేదు. అయినా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నారు. తీసిన ప్రతీసారి ప్రజలు చూసి ఆస్వాదిస్తూనే ఉన్నారు.    

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరోసారి రామాయణం ఆధారంగా ‘రామాయణ’ సిద్దం అవుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయిపల్లవి సీతమ్మవారిగా, రవి దుబే లకష్మణుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, కన్నడ నటుడు యష్ రావణుడుగా నటిస్తున్నారు. 

నేడు హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్‌ విడుదల చేశారు. సాంకేతికంగా చూస్తే టీజర్‌ అద్భుతంగా ఉంది. 

రామాయణం భక్తి, ఆధ్యాత్మిక భావనలతో నిండినది. కానీ వాటిని సాంకేతిక పరిజ్ఞానం మింగేసినట్లు టీజర్‌ చూస్తే అనిపిస్తోంది. ఇదివరకు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌ చేసిన ‘ఆదిపురుష్’, ముఖేష్ కుమార్‌ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు చేసిన ‘కన్నప్ప’ దెబ్బ తినడానికి అవసరానికి మించి సాంకేతిక పరిజ్ఞానం, ఫైట్స్, ఎలివేషన్స్, రొమాన్స్ వంటివి కూడా కారణాలే! 

ఎప్పటికప్పుడు అందివస్తున్న సాంకేతికతని జోడించి రామాయణాన్ని మరింత గొప్పగా చూపాలనుకోవడం తప్పు కాదు. కానీ అది భక్తి భావాన్ని మింగేయకూడదు. రామాయణ టీజర్‌లో ‘హాలీవుడ్‌ రాక్షసులను’ కూడా భారతీయులు అంగీకరించకపోవచ్చు. 

 టీజర్‌ చూసి సినిమాని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. మబ్బులకు సూర్యుడు వెండి అంచులు తొడిగినట్లే, రామాయణకి టెక్నాలజీ కూడా ఉండాలి కానీ అదే మూలకథని, భక్తిభావాన్ని మింగేయదని ఆశిద్దాం.            

రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. ఆ ప్రకారమే వస్తోందని టీజర్‌తో మరోసారి స్పష్టం చేశారు. 

ఈ సినిమాకు కధ: శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం: నితీష్ తివారీ, సంగీతం: ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్, వీఎఫ్ఎక్స్: డిఎన్ఈజీ (8సార్లు ఆస్కార్ అవార్డ్ గ్రహీత).               

Related Post