నేడు తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, “మనం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ వ్యూహాలలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము తప్ప మంత్రి పదవుల కోసం కాదు.
కనుక నేను ఏనాడూ నాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తానని హామీ ఇవ్వలేదు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేద్దాం. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మే 12న జరిగే ప్లీనరీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందాము,” అని అన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. ఒకవేళ అలాంటి ఆశలు కలిగి ఉంటే అయన రాజకీయాలు వేరే విధంగా ఉండేవి. అందుకే సిఎం రేవంత్ రెడ్డి ఆయనపై గౌరవంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయించారు.
కానీ అంత మాత్రాన్న తన ఉనికిని, పార్టీ ఉనికిని కోల్పోవాలనుకోవడం లేదని ఈవిధంగా చెప్పారు. అయితే కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్, టీఆర్ఎస్, వామపక్షాలు, ఇంకా అనేక చిన్న పార్టీలున్నప్పుడు టీజేఎస్ వాటన్నితో పోటీ పది కనీసం గౌరవ ప్రదమైన సీట్లు సాధించాలంటే గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ చాలా అవసరం.
కేవలం ప్రజా సమస్యల కోసం పోరాడితే సరిపోదని, పదవీ అధికారం కూడా చాలా అవసరమని ఇటీవలే కల్వకుంట్ల కవిత కూడా చెప్పారు కదా? కనుక టీజేఎస్ కూడా అదే దిశలో ముందుకు సాగాలసిన అవసరం ఎంతైనా ఉంది.