ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని హతం చేసిన అమెరికా ఇప్పుడు ఆయన వారసుడుగా ఇరాన్ బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ తలకు వెల కట్టింది. ఆయన ఆచూకీ తెలిపినవారికి పది మిలియన్ డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.93 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఆయనతో పాటు డెప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజా తదితరుల ఆచూకీ తెలిపినవారికి కూడా భారీగా బహుమతి ప్రకటించింది. వారి గురించి సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అవసరమైతే పునరావాసం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేసి హతమార్చామని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా దాడి చేసినప్పుడు తండ్రితో పాటు అదే భవనం ఉన్న మొజ్తాబా ఖమేనీ మాత్రం తప్పించుకోగలిగారు.
ఇప్పుడు ఆయన ఆచూకీ కనిపెట్టలేక సాయం కోరుతోంది. అంటే అమెరికా నిఘా వ్యవస్థ వైఫల్యం అయ్యిందనుకోవాలా లేక అమెరికా కంటే ఆయనే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనుకోవాలా? ట్రంప్ త్వరలోనే యుద్ధం ముగిసిపోతుందని చెపుతూ ఇలాంటి ప్రకటన ఇవ్వడాన్ని ఏమనుకోవాలి?