ఈ ఏడాది తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. సోమవారం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో ఏకంగా 46 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో 45.9 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 45.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.5 డిగ్రీలు నమోదైంది.
రాజధాని హైదరాబాద్‌లో మేడిపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 42.6 డిగ్రీలు, హిమాయత్ నగర్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ ఏర్పదబోతోందని దాని వలన ఈ ఏడాది ఎండలు, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని, వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనికి తాజా నిదర్శనంగా హైదరాబాద్‌లో నిన్న కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ మంచు ముక్కలతో కప్పబడిపోయేలా భారీగా వడగళ్ళ వాన కురిసింది.
ఏప్రిల్ నెలలోనే ఇంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు మే నెలలో మరెంత పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.