డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్‌

April 28, 2026


img

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వాలని,  పాస్‌పోర్టు పోలీసులకు అప్పగించాలని, అనుమతి లేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళరాదని, కేసుని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తుకు సహకరించాలని షరతులు విధించింది. వాటికి ఆయన న్యాయవాది అంగీకరించడంతో హైకోర్టు నేడు బెయిల్‌ మంజూరు చేసింది. 

కోర్టు ఆదేశాలు జైలు అధికారులకు చేరి, జైలులో జరగాల్సిన ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆలస్యం కావచ్చు. కనుక రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

మార్చి 14న రాత్రి మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు పోలీసులు ఆకస్మిక తనికీలు చేశారు. ఆ సమయంలో వారిపై తుపాకీతో కాల్పులు కూడా జరిపినందుకు, డ్రగ్స్ సేవించినందుకు కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్‌ పార్టీ ఆదేశించింది. 


Related Post