హైదరాబాద్ మెట్రో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చేసింది. దానికి పెట్టుబడి పెట్టి నిర్మించి ఇంతకాలం నడిపిస్తున్న ఎల్ & టి కంపెనీ చేతులెత్తేయడంతో దాని బకాయిలు, పెట్టుబడి వాటాని ప్రభుత్వం చెల్లించి, హైదరాబాద్ మెట్రోని స్వాధీనం చేసుకుంది.
కనుక ఇకపై మెట్రో రైల్ సర్వీసులను నడిపించే బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదే అవుతుంది. అయితే మొదటి నుంచి ఎల్&టితో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నందున ఇప్పుడు మెట్రో నిర్వహణ పెద్ద కష్టం కాకపోవచ్చు.
మెట్రో పూర్తిగా ప్రభుత్వం చేతికి రావడంతో సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు సంబందిత అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి మెట్రో నిర్వహణకు చకచకా ఏర్పాట్లు చేయించారు.
ముందుగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బోర్డ్ చైర్మన్‌గా ఉంటారు. ఎండీ మరియు కమీషనర్‌గా సర్పరాజ్ అహ్మద్, డైరెక్టర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జయేష్ రంజన్, బి.శివధర్ రెడ్డి, కేఅశోక్ రెడ్డి, జితేష్ వి పాటిల్, శివేంద్ర ప్రతాప్ ఉంటారు.