పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కొత్తగా ‘టీఆర్ఎస్ పార్టీ’ ఏర్పాటుని స్వాగతించి ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకి అభినందనలు తెలియజేస్తూనే, ఆమె తన తండ్రి, మాజీ సిఎం కేసీఆర్‌ని విమర్శించినంత మాత్రాన్న ఆణిముత్యం అయిపోరని చురకలు కూడా వేశారు.
“బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటునప్పుడు మౌనంగా ఉండి వారి అవినీతి, అక్రమాలలో ఆమె కూడా పాలు పంచుకున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటూ, తండ్రిని, ఆ పార్టీ నేతలని విమర్శిస్తే ఆమె తెలివిగా తప్పించుకోవాలనుకుంటున్నారు.
కేసీఆర్ చుట్టూ గుంట నక్కలు, తోడేళ్ళు ఉన్నాయని ఇప్పుడు చెపుతున్నారు. ఆ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆమె ఎందుకు చెప్పలేదు? అవినీతికి పాల్పడిన పార్టీ, ప్రభుత్వంలో ఉన్న ఆమెను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టాలి?
ఆశ ఉండాలి కానీ ఇంత అత్యాశ పనికిరాదు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణ ప్రజలు మావెంటే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. కేసీఆర్-బీఆర్ఎస్, కవిత-టీఆర్ఎస్ పార్టీలు పగటి కలలే,” అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.