ట్రంప్‌ సమావేశంలో కాల్పులు!!!

April 26, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పలువురు ప్రముఖులు పాల్గొన్న సమావేశంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంపై యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది.   

ఆయన అధికార నివాసం వైట్‌హౌస్‌ సమీపంలో హిల్టన్ హోటల్లో ‘వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్’ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి హటాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు.

వెంటనే ట్రంప్‌ భద్రతా సిబ్బంది ఆయనతో సహా ఆ సమావేశంలో పాల్గొన్న అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెక్సెత్‌, విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోల చుట్టూ రక్షణ కవచంగా నిలిచి వారందరినీ అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన వ్యక్తిని చుట్టు ముట్టి అరెస్ట్ చేశారు.

ఈ సమావేశంలో ఇంకా పలువురు ప్రముఖులున్నారు. వందల మంది అతిధులు కూడా ఉన్నారు. కనుక అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ ఆ వ్యక్తి అందరి కళ్ళుగప్పి తుపాకీతో లోనికి ప్రవేశించడమే కాకుండా కాల్పులు కూడా జరిపాడు. ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడి భద్రత ఎంత బలహీనంగా ఉందొ అర్థం అవుతోంది. 

ఈ సమావేశంలో కాల్పులు జరిగినప్పుడు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా అదే హోటల్లో బస చేశారు. అయన స్పందిస్తూ, “అమెరికా అధ్యక్షుడు ప్రాణాలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు. 

కానీ ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ మీడియాలో, “సీక్రెట్ సర్వీస్, పోలీస్ విభాగాలు చాలా అద్భుతంగా పని చేశాయి. షూటర్‌ని అదుపులోకి తీసుకున్నాయి. నేను క్షేమంగానే ఉన్నాను,” అంటూ భద్రతావైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నారు.        

Related Post