ఇంతకాలం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ప్రజల మద్య ఉన్న కల్వకుంట్ల కవిత రేపటి నుంచి ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ అధ్యక్షురాలిగా ప్రజల మధ్యకు రాబోతున్నారు.
రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా, అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. కనుక ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలపై ఆమె ఫోటోతో సుస్వాగతం ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ అని ఉంది. కనుక ఒక రోజు ముందే ఆమె పార్టీ పేరు ఈవిధంగా బయటపెట్టక తప్పలేదు.
బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత తన తండ్రి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన సోదరుడు కేటీఆర్ మీద ఆమె చేస్తున్న తీవ్ర విమర్శలపైనే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ తగిన విధంగా స్పందించలేదు. ఆ పార్టీకి మూల స్థంభం వంటి హరీష్ రావుని ఆమె ‘గుంట నక్క’ అని, ఆయనే ఏదో రోజు కేసీఆర్, కేటీఆర్‌లను, బీఆర్ఎస్ పార్టీని కూడా నిలువునా ముంచేస్తారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నా హరీష్ రావుతో సహా ఎవరూ స్పందించడం లేదు. ఇటీవల జగిత్యాల సభలో కేసీఆర్ ఆమె విమర్శలకు జవాబు చెపుతారనుకుంటే, ఆయన ఆ ఊసే ఎత్తలేదు.
ఇప్పుడు ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీపై మరింత తీవ్ర విమర్శలు చేయవచ్చు. ఆ పార్టీ నేతలను తన పార్టీలోకి ఆకర్షించడం కూడా ఖాయమే.
కనుక కవిత పార్టీ పేరు, పార్టీ ఏర్పాటు, ఆమె చేస్తున్న రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించక తప్పదు. రేపు ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ ప్రకటనతో ఆ సమయం వచ్చేసినట్లే.