వీహెచ్ నియామకం... జీవన్ రెడ్డి ఎఫెక్టే?

May 01, 2026


img

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నాయకుడు, 18 ఏళ్ళు ఎంపీగా చేసిన అనుభవజ్ఞుడు వి.హనుమంత రావు (విహెచ్)ని  క్యాబినెట్ హోదాతో బీసీ సంక్షేమ సలహాదారుగా నియమించడంపై పార్టీలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఎఫెక్టే అని మరికొందరు వాదిస్తున్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళ తర్వాత ఇప్పుడు హటాత్తుగా ఆయనకు ఈ పదవి దేనికంటే జీవన్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరినందునే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.           

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నేతలు, ఎమ్మెల్యేలను తీసుకుపోయి పార్టీని బలహీనపరుస్తున్నప్పుడు పార్టీ తరపున గట్టిగా పోరాడిన సీనియర్ నాయకులలో విహెచ్‌ కూడా ఒకరు. పార్టీ కష్ట కాలంలో అండగా నిలబడిన అయనకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. 

అయినా విహెచ్ ఎన్నడూ ఎవరినీ తప్పు పట్టలేదు. పదవుల కోసం అర్రులు చాచలేదు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ నాయకుడుగా తరచూ గాంధీ భవన్‌కి వచ్చి ప్రభుత్వం, పార్టీ తరపున మీడియాతో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనందున మరింత చురుకుగా వ్యవహరించే అవకాశం ఆయనకు కలిగింది.


Related Post