పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఈసారి బిజేపి గెలిచి అధికారంలోకి వస్తుందని, బిజేపి-తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు సరిసమానంగా సీట్లు వస్తాయంటూ పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
వాటిపై పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, “అవన్నీ భూటకమే. రాష్ట్రంలో బిజేపి ఓడిపోబోతోందని గ్రహించిన కొందరు బిజేపి పెద్దలు మీడియా సంస్థలకు భారీగా డబ్బు ముట్టజెప్పి తమ పార్టీ గెలవబోతోందని చెప్పించుకున్నాయి.
ఈ సర్వేల నివేదికలన్నీ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే తప్ప మరి దేనికీ ఉపయోగపడవు. ఈసారి మరింత భారీ మెజార్టీతో మేము గెలుస్తాము. మొత్తం 294 స్థానాలకి 226 పైనే గెలుచుకుంటాము. మే 4న ఫలితాలు వెలువడినప్పుడు అందరూ చూస్తారు,” అని అన్నారు.
ఈసారి ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా భావిస్తున్న 96 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ఆమే ఆరోపించారు. ఈ నేపధ్యంలో చూస్తే ఆమె చెప్పుకున్నట్లుగా ఒంటరిగా 226 సీట్లు గెలుచుకోవడం అసంభవమే.
సర్వేలు పక్కన పెట్టినా ఆమె బొటాబొటి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు. లేదా సర్వేలు సూచించినట్లు బిజేపి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కనుక ఆమెతో సహా అందరూ మే 4 వరకు ఎదురుచూడక తప్పదు.