పశ్చిమ బెంగాల్లో నేడు తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 23న మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరుగగా నేడు మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలలో సిఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ నుంచి బిజేపి అభ్యర్ధిగా సువెందు అధికారి పోటీ చేస్తున్నారు.
ఈసారి ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని బిజేపి, గెలిచి అధికారం నిలుపుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.
ఒకవేళ ఈ ఎన్నికలలో తృణమూల్ ఓడి బిజేపి అధికారంలోకి వస్తే దాని బలం మరింత పెరుగుతుంది. ఒకవేళ తృణమూల్ గెలిచి బిజేపి మళ్ళీ ఓడితే, ఈసారి ఢిల్లీకి వచ్చి మిత్రపక్షాలన్నిటినీ కూడగట్టి కేంద్రంలో కూడా బిజేపిని గద్దె దించుతానని మమతా బెనర్జీ శపథం చేశారు. ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరిస్తే ఇండియా కూటమి మరింత బలపడుతుంది.
ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కనుక ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వస్తే బెంగాల్ కోట ఎవరిదో తెలుస్తుంది.