నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పహల్గాం దాడికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. త్రివిద దళాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టినప్పటి నుంచి ముగించే వరకు అవి వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకొని అమలు చేశాయి.
ఆపరేషన్ సిందూర్ ఎవరి ఒత్తిళ్ళతోనో అర్ధంతరంగా నిలిపివేయలేదు. అది కూడా వ్యూహాత్మక నిర్ణయమే. కానీ అవసరమైతే పాక్‌తో దీర్గకాల యుద్ధానికి భారత్ సిద్దంగానే ఉంది.
భారత్ అంతర్జాతీయ ఐటి రంగానికి కేంద్రంగా అభివృద్ధి చెంది గుర్తింపు పొందుతుంటే, పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా గుర్తింపు పొంది ఆ దిశలోనే ముందుకు సాగుతోంది. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదమే. దానిని కూకటి వేళ్ళతో పెకలించివేసినప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది,” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఆయన ఆ సందర్భం బట్టి ఈవిధంగా మాట్లాడారని అర్ధమవుతూనే ఉంది. నాలుగు రోజుల పాటు సాగిన ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్ తడాఖా పాక్‌తో సహా ప్రపంచ దేశాలకు కూడా తెలిసి వచ్చింది. కానీ ఈ నాలుగు రోజుల యుద్ధానికి భారత్ కూడా భారీగానే ఖర్చయ్యింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం చేసుకుంటుంటే భారత్‌లో గ్యాస్ సిలిండర్స్ కొరత ఏర్పడి చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ సైతం మూతపడ్డాయి. తరచూ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న యుద్ధంతో భారత్‌లో ఇటువంటి పరిస్థితులు నెలకొంటే, భారత్-పాక్ మద్య దీర్గకాల యుద్ధం జరిగితే?