ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలవాలనుకుంటే అడ్డుకుంటా!

May 01, 2026


img

ఈసారి పశ్చిమ బెంగాల్లో 91 శాతం పైగా పోలింగ్ నమోదైంది. కారణం బిజేపి రిగ్గింగ్ చేయడమే అని సిఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. రిగ్గింగ్ చేసినప్పటికీ బిజేపి నేతలకు గెలుస్తామనే నమ్మకం లేకపోవడం వల్లనే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు కుట్రలు చేయవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 

కనుక ఆమె నిన్న అర్ధరాత్రి ఆమె మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని దక్షిణ కోల్‌కత్తాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలోని ఈవీఎంలన్నిటినీ అక్కడే భద్రపరిచారు. 

కానీ అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు స్కూల్ బయటే నిలబడి మీడియాతో మాట్లాడుతూ, “ఎవరైనా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయాలని చూసినా, లేదా ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయాలనుకున్నా సహించే ప్రసక్తే లేదు. అంతా పద్దతిగా జరిగితే మా తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ 226 సీట్లు పైనే సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు. 

 ఉత్తర కోల్‌కత్తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌లలో ఆయా పరిసర ప్రాంతాల నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. సిఎం మమతా బెనర్జీ ఆదేశం మేరకు తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని గేటు బయట ధర్నా చేశారు. 

బిజేపి నేతలు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. “ఈసారి మా పార్టీ చేతిలో ఓటమి తప్పదని గ్రహించినందునే ఆమె ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. ఈసారి తప్పకుండా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని మమతా బెనర్జీ బల్ల గుద్ది వాదిస్తున్నప్పుడు ఇంకా భయం దేనికి? నిజానికి తృణమూల్ కాంగ్రెస్‌ గూండాల నుంచి మేమే ఈవీఎంలను కాపాడుకోవాలి,” అని అన్నారు. 



Related Post