డ్రగ్ టెస్టులకు రెడీయా? యస్ మేము రెడీ!

March 15, 2026


img

శనివారం రాత్రి మొయినాబాద్‌లో బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌసులో మాదక ద్రవ్యాలు  సేవిస్తూ ఆయనతో సహా పలువురు పట్టుబడటంతో ఊహించినట్లే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో రాష్ట్రంలో యువతకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడేలా చేసి వారి జీవితాలు నాశనం చేశారు. వాటికి అలవాటు పడినవారిలో బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఒకరని నిన్న స్పష్టమైంది.

నిజానికి కేటీఆర్‌తో సహా ఆయన బ్యాచ్‌లో అందరికీ మాదక ద్రవ్యాలు అలవాటు ఉందని గతంలో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అది నిజమని ఇప్పుడు తేలింది. కనుక రేపు శాసనసభ సమావేశంలో అందరం డ్రగ్ టెస్టులు చేయించుకుందాము.

ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం మాదక ద్రవ్యాలకు బానిసలం కాదని ప్రజలకు తెలియాల్సి ఉంది. కనుక రేపు ఉదయం కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరూ శాసనసభ ఆవరణలో డ్రగ్ టెస్టు కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి,” అని మహేష్ కుమార్‌ గౌడ్ విజ్ఞప్తి చేశారు. 

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆయన సవాలుపై వెంటనే స్పందిస్తూ, “నేను ఎలాంటి పరీక్షకైన సిద్ధం. కానీ నాకు మాదక ద్రవ్యాలు అలవాటుందని ఊరికే మాట్లాడితే అందరినీ కోర్టుకీడ్చుతాను,” అని జవాబిచ్చారు. 


Related Post