నేడు తెలంగాణ భవన్‌లో జరిగిన మేడే వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కోవిడ్ సమయంలో లేబర్ క్యాంపులు ఏర్పాటు చేసి అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు పూర్తి చేయించారు.
సొంతూర్లు వెళ్ళే పొరుగు రాష్ట్రాల కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్ని రకాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో రెండేళ్ళు భరించక తప్పదు. ఆ తర్వాత కేసీఆర్ వస్తారు మీ అందరి కష్టాలు తీర్చుతారు,” అని కేటీఆర్ అన్నారు.
దాదాపు రెండున్నరేళ్ళుగా కేసీఆర్ రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. శాసనసభ సమావేశాలకు కూడా హాజరుకాకుండా ఏటా లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకుంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపిస్తున్నా రావడం లేదు.
కనీసం తరచూ తెలంగాణ భవన్‌కి వచ్చి రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలకు మార్గదర్శనం చేయడం లేదు. నాడు నేడూ కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత కూతురు కల్వకుంట్ల కవిత పేరు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ మౌనంగా ఉండిపోతున్నారు. ఆమె ‘నేనే తదుపరి ముఖ్యమంత్రిని’ అని ప్రకటించుకొని టీఆర్ఎస్ పార్టీతో దూసుకుపోతున్నారు.
మరో పక్క కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ని ఓడగొట్టిన బాహుబలి రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు. బిజేపి కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధాని మోడీ, అమిత్ షా వంటి హేమాహేమీలున్నారు.
ఈ నేపధ్యంలో చూస్తే రెండేళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలదు?
కేసీఆర్, కేటీఆర్‌లకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, చులకనభావం ఉన్నంత మాత్రాన్న రాష్ట్ర ప్రజలందరికీ ఉంటుందని ఎలా అనుకోగలరు? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది కనుక అదే తమని గెలిపిస్తుందని నమ్మకంతో కాలక్షేపం చేస్తుండటం సరైనదేనా?
ఒకవేళ ప్రజలలో తన ప్రభుత్వం పట్ల నిజంగానే వ్యతిరేకత ఉన్నా సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో మ్యాజిక్ చేసి పార్టీని గెలిపించుకోకుండా ఉంటారా? కేటీఆరే ఆలోచించుకోవాలి.
నాడు కేసీఆర్ గారు పొరుగు రాష్ట్రాల కూలీలను కూడా కడుపున పెట్టుకుని చూసుకుంటే..
— BRS Party (@BRSparty) May 1, 2026
నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి కార్మికులు చనిపోతే, వాళ్ల మృతదేహాలను గుర్తించలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనను చూస్తుంటే కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు తప్ప… pic.twitter.com/MUlL9wcmNf