హైదరాబాద్‌లో మరో రెండు అతి పెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్‌లు రాబోతున్నాయి. వాటిలో ఒకటి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడ వద్ద, మరొకటి గాజులరామారం వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతోంది.
బహదూర్‌గూడ వద్ద 150 ఎకరాలలో, గాజులరామారం వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్ధం వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు.
శుక్రవారం రాత్రి ఆర్టీసీ సంఘాల నేతలు జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కలిసి, ఇటీవల సమ్మె ముగింపు సమయంలో మంత్రులతో చర్చించిన కొన్ని అంశాలపై వివరణ కోరారు.
సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మూడు రోజుల సమ్మె కాలానికి ఉద్యోగుల జీతాలు చెల్లిస్తామని చెప్పారు. సమ్మె సమయంలో వారిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీలో 14 కార్మిక సంఘాలున్నందున ఎన్నికల నిర్వహణ విషయంలో తమలో తాము చర్చించుకొని ఒక ప్రతిపాదన ఇవ్వాలని కోరారు. లేదా దేనికది వేర్వేరుగా ప్రతిపాదనలు ఇస్తే అన్నిటినీ పరిశీలించి ఎక్కువ సంఘాలకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదనపై మళ్ళీ చర్చిద్దామని చెప్పారు.
అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియపై కార్మిక సంఘాల నేతలు చర్చించుకొని తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని వాటిపై కూడా మరోసారి చర్చిద్దామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డితో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ వైసీపీ.నాగిరెడ్డి పాల్గొనగా, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వెంకన్న, అశ్వథామ రెడ్డి, థామస్ రెడ్డితో సహా పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.