పదేళ్ళ తర్వాత ధృవ నక్షత్రం కనపడుతోందంటే ఆకాశంలో నక్షత్రం కాదు. పదేళ్ళ క్రితం గౌతమ్ వాసుదేవ మేనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తీసిన సినిమా. దీనిని 2016లో పూర్తిచేసి 2017 చేయాలనుకున్నారు. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల వలన 2023 వరకు సినిమా విడుదల చేయలేకపోయారు. అప్పటికే 7 సంవత్సరాలు ఆలస్యమైంది. అప్పుడు కూడా మళ్ళీ ఆటంకం ఏర్పడింది.
ఒప్పందం ప్రకారం ముందుగా తమ బకాయిలు చెల్లించి తర్వాత సినిమా విడుదల చేసుకోవాలంటూ ‘ఆన్ ఇన్ పిక్చర్స్’ సంస్థ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. అప్పటి నుంచి ఆ కేసు కోర్టులో నలుగుతూనే ఉంది. గౌతమ్ మేనన్ కూడా ఇక ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు.
కానీ తన లాయర్ న్యాయపోరాటం చేసి సినిమా విడుదలకి మార్గం సుగమం చేశారని గౌతమ్ మేనన్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. సినిమా విడుదలకు ఆదేశం ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.
ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా రీతూ వర్మ నటించారు. పదేళ్ళ తర్వాత వారిద్దరూ నటించిన సినిమా విడుదలవుతుండటంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.