పదో తరగతి పరీక్షలలో విషాదాలు

March 14, 2026
img

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవడంతో రోడ్లపై ఎక్కడ చూసినా విద్యార్ధుల హడావుడే కనిపిస్తోంది. అయితే ఇద్దరు విద్యార్ధులు తీవ్ర దుఃఖంతో పరీక్షలకు హాజరయ్యారు. ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకి చెందిన హర్షవర్ధన్ కాగా మరొకరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని బత్తులపల్లికి చెందిన గండేపల్లి మణికంఠ. 

ఇద్దరు విద్యార్ధుల తండ్రులు నిన్న (శుక్రవారం) చనిపోయారు. బత్తులపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు వ్యవసాయకూలిగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. తండ్రి అంత్యక్రియలు చేసి గండేపల్లి మణికంఠ నేడు పరీక్షలకు హాజరయ్యాడు. 

మరో విద్యార్ధి హర్షవర్ధన్ తండ్రి కూరెల్ల ఎల్లయ్య గుండాల మండలం వస్తకొందూరులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం స్కూల్లో ఉన్నప్పుడు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి సెలవు తీసుకొని నల్గొండలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు హైదరాబాద్‌ తీసుకువెళ్లమని సూచించారు. కుటుంబ సభ్యులు ఆయనని అంబులెన్సులో హైదరాబాద్‌ తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. హర్షవర్ధన్ కూడా తండ్రి అంత్యక్రియలు చేసి ఆ బాధలోనే నేడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.

Related Post