హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కనుక మొదటి పదిరోజులు టికెట్ చార్జీలు పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇదివరకు తెలంగాణ హైకోర్టు కనీసం మూడు నెలల ముందుగా టికెట్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని షరతు విధించింది.
ఆ లెక్కన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి టికెట్ ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశం ఉండదు. కనుక హైకోర్టు ఉత్తర్వులపై మైత్రీ మూవీస్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఓ పిటిషన్ వేసింది. నేడు దానిపై సుప్రీంకోర్టు విచారణ జరిపినప్పుడు మైత్రీ తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, ముకుల్ రోహాత్గీ తమ వాదనలు వినిపించారు.
వారి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన 90 రోజుల గడువు ఆదేశంపై స్టే విధించింది. కనుక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకొని అవి అనుమతిస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు మార్గం సుగమం అయినట్లే.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేనకు చెందిన కందుల దుర్గేశ్ ఉన్నారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కూడా వారికి మంచి సఖ్యత ఉంది. కనుక దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం... వెంటనే అనుమతి లభిస్తుంది.
కానీ తెలంగాణ ప్రభుత్వం టికెట్ చార్జీల పెంపుకి అనుమతిస్తూ జీవో జారీ చేసిన వెంటనే హైకోర్టులో పిటిషన్లు పడుతుంటాయి. కనుక ఈ విషయంలో తెలంగాణలోనే కాస్త సందిగ్ధం నెలకొనవచ్చు.