ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా గత 13 ఏళ్ళుగా కోమాలో ఉన్నాడు. అతను జీవితంలో మళ్ళీ కోలుకునే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ఇంతకాలం అతని కుటుంబ సభ్యులు అతను కోలుకుంటాడని ఆశగా ఎదురుచూశారు. కానీ అతని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వారు అతని కారుణ్య మరణం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం వైద్య నిపుణుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కారుణ్య మరణానికి అనుమతించింది.
దీంతో నేడు (అదివారం) అతని తల్లితండ్రులు, బంధుమిత్రులు, మత గురువుల సమక్షంలో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ‘లైఫ్ సపోర్ట్’ తీసేశారు.
హరీశ్ రాణా 2013లో చండీగఢ్‌లో ఒక భవనం నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు.
అనుమతితో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నేడు లైఫ్ సపోర్ట్ తొలగించి జీవచ్చవంలా జీవిస్తున్న అతనికి విముక్తి కల్పించారు. 13 ఏళ్ళుగా కోమాలో మంచంపైనే ఉన్న కొడుకు తమ కళ్ళ ముందే ప్రాణాలు విడవడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అతనికి కారుణ్య మరణం ప్రసాదిస్తూ తీర్పు చెపుతున్నప్పుడు న్యాయమూర్తులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. “మందులు పనిచేయనప్పుడు, కేవలం జీవితాన్ని అనవసరంగా పొడిగించడం కంటే ప్రకృతికి అప్పగించడమే మేలు,” అని న్యాయమూర్తులు అన్నారు.