యుద్ధ సంక్షోభం వేళ భారత్‌కు ఊరట

March 12, 2026
img

అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలయ్యి 12 రోజులు. ఈ కొన్ని రోజులకే భారత్‌తో సహా యావత్ ప్రపంచ దేశాలు గ్యాస్, చమురు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దౌత్యం ఫలించడంతో హర్మూజ్ జలసంధిలో భారత్‌ చమురు నౌకలకు ఇరాన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

ఎస్.జైశంకర్ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చీతో ఫోన్లో ఈ అంశం గురించి మాట్లాడారు. మంగళవారం రాత్రి మళ్ళీ మాట్లాడి ఒప్పించగలిగారు. దీంతో హర్మూజ్ జలసంధిలో భారత్‌ జెండాతో ప్రయాణించే చమురు నౌకలపై దాడి చేయబోమని, అవి సురక్షితంగా జలసంధి దాటేందుకు సహకరిస్తామని ఇరాన్‌ ప్రకటించింది.

ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలలోనే భారత్‌కు చెందిన పుష్పక్, పరిమళ్ అనే చమురు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్‌ వైపు వస్తున్నాయి. 

ఇప్పటికే తీవ్ర గ్యాస్ సంక్షోభంతో కటకటలాడుతున్న భారత్‌కు ఇది చాలా ఉపశమనం కలిగించే విషయమే. హర్మూజ్ జలసంధిలో అనుమతించకపోతే చుట్టూ తిరిగి భారత్‌ చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే అదనపు ఖర్చవుతుంది. కానీ ఇప్పుడు హర్మూజ్ నుంచి నేరుగా భారత్‌కు చేరుకోవచ్చు కనుక భారత్‌లో చమురు, గ్యాస్ సరఫరా పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకోవచ్చు.

కానీ ఇప్పుడు గ్యాస్, చమురుకు చాలా డిమాండ్ ఉన్నందున సముద్రపు దొంగల బెడద మొదలవుతుంది. కనుక భారత్‌ చమురు నౌకలకు రక్షణగా నేవీ రంగంలో దిగాల్సి వస్తుందేమో? 

Related Post