కేంద్ర మంత్రి, తెలంగాణ బిజేపి ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయనతో పాటు కరీంనగర్ కార్పోరేషన్ బిజేపి సభ్యులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాదయత్రలో పాల్గొంటున్నారు.
ఈరోజు సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల లోపు కొండగట్టు చేరుకునే అవకాశం ఉంది. కొండగట్టులో శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన తర్వాత అందరూ వాహనాలలో తిరిగి కరీంనగర్ చేరుకుంటారు.
ఈ యాత్రలో చిన్న అపశ్రుతి జరిగింది. బండి సంజయ్ పాదయాత్ర జిల్లాలో రామడుగు మండలం కోన్ రావు పేట గుండా సాగుతున్నప్పుడు, ఈ పాదయత్రని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ పొరపాటున దారిపక్కనే ఉన్న ఓ చెట్టుకి వ్రేలాడుతున్న తేనెతుట్టెని డ్రోన్‌తో డీకొట్టాడు. దాంతో ఒక్కసారిగా తేనెటీగలు పాదయాత్ర చేస్తున్న బిజేపి కార్యకర్తలపై దాడి చేశాయి. దాంతో బండి సంజయ్‌తో సహా అందరూ అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు.
తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. బండి సంజయ్ వారికి స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టారు.
ఇటీవల జరిగిన కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో బిజేపి గెలిస్తే, బిజేపి కార్పోరేటర్లతో కలిసి కాలినడకన కొండగట్టుకి వచ్చి అంజన్నస్వామిని దర్శించుకుంటామని బండి సంజయ్ మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడం కొరకే కాలినడకన కొండగట్టుకి బయలుదేరారు. మరికొద్ది సేపటిలో కొండగట్టు చేరుకుంటారు.