మాదక ద్రవ్యాలకు నేను, మా పార్టీ వ్యతిరేకం!

March 15, 2026


img

శనివారం రాత్రి మొయినాబాద్‌లో బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌసులో మాదక ద్రవ్యాలు  సేవిస్తూ ఆయనతో సహా పలువురు పట్టుబడటంతో బీఆర్ఎస్‌ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది.

కనుక పైలట్ రోహిత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయవచ్చని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మత్తు పదార్థాలు (డ్రగ్స్) మనుషులను రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు కూడా డ్రగ్స్ బారిన పడటం దురదృష్టకరం. వ్యక్తిగతంగా నేను డ్రగ్స్ మరియు అక్రమ పదార్థాల వినియోగానికి పూర్తి వ్యతిరేకం.

నా బీఆర్ఎస్‌ పార్టీ డ్రగ్స్ వాడకాన్ని మరియు ఎలాంటి అక్రమ కార్యకలాపాలనైనా తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వాడుతున్నా లేదా విక్రయిస్తున్నా, వారి రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి.

అయితే, ఈ అత్యంత దారుణమైన పరిస్థితిలోకి బీఆర్ఎస్‌ పార్టీని లాగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ కక్ష సాధింపు కోసం డ్రగ్స్ కేసును వాడుకోవడం మీ (కాంగ్రెస్‌) నీచ రాజకీయాలకు నిదర్శనం.

నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను. మనమే ఆదర్శంగా నిలుద్దాం.

అలాగే, ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాను. అలాంటి ప్రయత్నాలపై చట్టపరంగా స్పందిస్తాను,” అని ట్వీట్‌ చేశారు. 


Related Post