భారత్-పాక్ మద్య యుద్ధం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 మళ్ళీ ఈ నెల 17 నుంచి మొదలవబోతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఐపీఎల్ లీగ్ భాగస్వాములను సంప్రదించి అనుమతి తీసుకున్న తర్వాతే మిగిలిన 17 మ్యాచ్‌లకు రీ షెడ్యూల్ ప్రకటించామని తెలిపింది.
ఇది వరకు ప్రకటించిన బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబయి, అహ్మదాబాద్ నగరాలలో ఈ నెల 17 నుంచి 27 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 18,25తేదీలలో (ఆదివారాలు) రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి.
ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30 న ఎలిమినేటర్, జూన్ 1న రెండో క్వాలిఫయర్, జూన్ 3న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్ మ్యాచ్ వేదికలని త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.
ఈ నెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా నిలిపి వేసిన పంజాబ్‌లో కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ని ఈ నెల 24న న్యూ ఢిల్లీలో జరుగుతుంది.
అదేవిదంగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మద్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. ఈ నెల 25న న్యూ ఢిల్లీలో జరుగుతుంది.