ఇరాన్ మీద అసలైన బాంబులు ఇంకా ప్రయోగించనే లేదని, ఇక నుంచి అత్యంత శక్తివంతమైన బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొన్ననే హెచ్చరించారు. చెప్పినట్లుగా అమెరికా వాయుసేనలో అత్యంత భారీ మరియు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానాలు ‘బి-52 హెచ్’లతో బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఒక్కో విమానం ఏకంగా 38 టన్నుల బాంబులు వర్షంలా కురిపించి శత్రుస్థావరాలను నేలమట్టం చేయగలవు. ఒక్కో విమానం 20 క్రూయిజ్ క్షిపణులు, బంకర్ బస్టర్లు, క్లస్టర్ బాంబులు, జీపీఎస్ గైడడ్ క్షిపణులు, చివరికి అణు బాంబులు కూడా ప్రయోగించగలవు.
ఈ విమానాలలో అత్యాధునిక ఆప్టికల్ సెన్సర్స్, ఇన్ఫ్రారెడ్, బ్యాటిల్ అసెస్మెంట్ టెక్నాలజీ వంటివన్నీ ఉన్నాయి. కనుక ఈ విమానాలు గాల్లో ఉన్నప్పుడు 3,64,000 చదరపు కిమీ పరిధిలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టి బాంబుల వర్షం కురిపించగలవు.
ఈ విమానాలు ఒకసారి గాల్లోకి లేస్తే ఏకధాటిగా 14,080 కిమీ దూరం ప్రయాణించగలవు. గాల్లోనే ఇంధనం నింపుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలాంటి అరడజను యుద్ధ విమానాలు ప్రస్తుతం ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.
అమెరికా చేతిలో ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు, రకరకాల బాంబులు ఉంటే ఉండొచ్చు. కానీ వాటిని ఇరాన్ ప్రజలపై వేసి పరీక్షించుకోవాలనుకోవడమే చాలా దారుణం!