తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లకు మొత్తం 16 మంది రేసులో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. నామినేషన్స్ వేసేందుకు ఈ నెల 5వరకు గడువుంది. కానీ ఇంతవరకు అభ్యర్ధులను ఖరారు చేయలేదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి రేసులో ఉన్న 16 మంది పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించామని తెలిపారు. ఈరోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నంలోగా ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం అడగలేదని తెలిపారు.
ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశించి దక్కనివారు నిరాశ పడాల్సిన అవసరం లేదని ఈ నెలాఖరులోగా కొన్ని కార్పోరేషన్ పదవులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం వాటిపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
దేశవ్యాప్తం వివిధ రాష్ట్రాలలో మొత్తం 37 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు డా.అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ నేలతో ముగుస్తుంది. ఈ సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేసింది.
దాని ప్రకారం మార్చి 5వరకు నామినేషన్స్ గడువు, మర్నాడు పరిశీలన, మార్చి 9 నామినేషన్స్ ఉప సంహరణ గడువు.
మార్చి 16 ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంటనే ఫలితాల వెల్లడిస్తారు.